లింగ నిర్ధరణ పరీక్షలను ప్రభుత్వాలు నిషేధించి.. ఆ మేరకు పరీక్షలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూ.. కఠినమైన చట్టాలు అమలు చేస్తున్నా అక్కడక్కడా చట్టవిరుద్ధంగా ఇలాంటివి జరుగుతున్న ఉదంతాలు బయటపడుతున్నాయి.
తాజాగా ఖమ్మం నగరం చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల్లో గర్భిణులకు స్కానింగ్ చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు.
ఓ ప్రభుత్వ వైద్యుడు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఈ ముఠాను అదుపులోకి తీసుకున్నారు.
ఓ ఇద్దరు ఆర్ ఎంపీలు, మహిళ ముఠాగా ఏర్పడి..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ‘‘ఖమ్మం నగర శివారు బల్లేపల్లికి చెందిన ఆర్ ఎంపీ చారి, ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని అల్లిపురానికి చెందిన కాత్యాయని గతంలో నగరంలోని ఓ ప్రైవేట్ ల్యాబ్ లో పనిచేసేవారు.
కొన్నాళ్ల కిందట ఆ ల్యాబ్ యజమాని చనిపోవడంతో దాన్ని మూసివేశారు. ఆ తర్వాత ఈ ఇద్దరూ చింతకాని మండలం కొరుమూరుకి చెందిన ఆర్ ఎంపీ మనోజ్ తో కలిసి ఈ మొబైల్ లింగ నిర్ధరణ పరీక్షలు చేయడం మొదలుపెట్టారు.’’
ఈ మేరకు ఆల్ట్రాసౌండ్ స్కాన్ యంత్రం, ఇతర సామగ్రితో పాటు ఓ కారుని కొనుగోలు చేసి.. కారులో ఆ మెషీన్ ను పట్టుకుని ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్లి పరీక్షలు చేసేవారని పోలీసులు చెప్పారు.
‘‘చారి, మనోజ్ ఇద్దరు ఆర్ ఎంపీ డాక్టర్లు కావడంతో గ్రామీణ ప్రాంతాల్లో వీరికి పరిచయాలున్నాయి.
ఆ క్రమంలో గర్భిణులకు, ఎక్కువగా గిరిజన ప్రాంతాల్లోని మహిళలకు లింగ నిర్ధరణ పరీక్షలు చేస్తామని చెపుతుండే వారు. గర్భిణులు ఎక్కడికీ రానవసరం లేదనీ, వారి ఇంటికే వచ్చి పరీక్షలు చేస్తామని, ఇంటి వద్ద కూడా ఇబ్బంది అనుకుంటే కారులో ఊరు చివరికో, ఎవరూ లేని ప్రదేశానికి తీసుకువెళ్లి కారులోనే పరీక్షలు చేసేవారు.
ఇలా ఖమ్మం రూరల్ తో పాటు ఇల్లెందు, మహబూబాబాద్, డోర్నకల్ తదితర ప్రాంతాల్లోని గ్రామాలకు కూడా వెళ్లి గర్భిణులకు లింగ నిర్ధరణ పరీక్షలు చేసేవారు. ఇందుకోసం ఒక్కొక్కరి నుంచి కనీసంగా రూ. 10 వేల నుంచి కూ.15 వేల వరకు వసూలు చేసేవారు.'' అని చింతకాని ఎస్ ఐ షేక్ నాగుల్ మీరా బీబీసీతో వెల్లడించారు.
ఎలా బయటపడిందంటే..
ఈ ముగ్గురి వ్యవహారంపై చింతకాని మండల వైద్యాధికారి డాక్టర్ అల్తాఫ్ మొహమ్మద్ కి అనుమానం వచ్చి ఎస్ ఐ షేక్ నాగుల్ మీరా దృష్టికి తీసుకువచ్చారు.
దీంతో నాగూల్ మీరా వారి కదలికలపై నిఘా పెట్టారు.
గురువారం నలుగురు మహిళలని టెస్ట్ చేసేందుకు కొరుమూరులోని మనోజ్ ఇంటికి తీసుకువచ్చిన క్రమంలో ఆర్ ఎంపీ మనోజ్ , కాత్యాయనీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ప్రధాన నిందితుడు చారి పరారయ్యారని, అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తే గానీ వీళ్లు ఎంత మందికి పరీక్షలు నిర్వహించారు.. వీరి వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా.. అనే వివరాలు తెలుస్తాయని ఎస్సై షేక్ నాగుల్ మీరా బీబీసీకి తెలిపారు.
చిన్నపాటి స్కానింగ్ మెషీన్ ను కారులో కంప్యూటర్ కి అటాచ్ చేశారు. గర్భిణి స్కాన్ పూర్తి కాగానే డెస్క్ టాప్ మానిటర్ లో వచ్చే పిక్చర్ చూపిస్తారు.
ఆ పిక్చర్ లో కనిపించే జెండర్ (ఆడ లేదా మగ బిడ్డ) అనేది వారికి తెలియజేస్తారు.
‘‘ శుక్రవారం మేం, పోలీసులు వెళ్లేటప్పటికే ఇద్దరు మహిళలకు టెస్ట్ చేశారు. మొత్తం ఈ ముగ్గురే చేస్తారు. మనోజ్ కారు డ్రైవ్ చేస్తారు. కాత్యాయని టెస్ట్ చేస్తుంది. ఏ ఊళ్లో గర్భిణులున్నారు. ఎవరెవరికి పుట్టబోయే బిడ్డ జెండర్ తెలుసుకోవాలని ఉంది? వాళ్లు కనీసంగా పదివేలైనా ఇవ్వగలరా.. అనే వివరాలను ఆర్ ఎంపీ చారి తెలుసుకుని ముందుగానే డబ్బులు తీసుకునే వాడు. ఈ ముగ్గురిలో అతనిదే ప్రధాన పాత్ర.'' అని చింతకాని మండల వైద్యాధికారి డాక్టర్ అల్తాఫ్ మొహమ్మద్ బీబీసీకి తెలిపారు.
సమాచారం రాగానే పోలీసుల దృష్టికి తీసుకెళ్లాం
ఖమ్మం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కళావతిబాయి బీబీసీతో మాట్లాడుతూ.. దీనిపై మండల వైద్యాధికారి డాక్టర్ అల్తాఫ్ మొహమ్మద్ మాకు సమాచారమివ్వగా... తాము వెంటనే పోలీసుల దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు.
పోలీసులు విచారిస్తే గానీ దీని వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనేది తెలుస్తుందని చెప్పారు.
నిజానికి పరీక్షలు చేసిన వారికే కాక, పరీక్షలు చేయించుకున్న వారు, అందుకు ప్రోత్సహించిన వారికి కూడా శిక్షలు పడతాయని, గర్భిణులు దీనిపై అవగాహన కలిగి ఉండాలని ఆమె అన్నారు.
చట్టం ఏం చెబుతోంది?
ఇలాంటి కేసుల్లో కనీసంగా ఏడాది నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్షపడే అవకాశం ఉంటుందని డాక్టర్ అల్తాఫ్ చెప్పారు.
''గర్భస్థ శిశు లింగ నిర్ధరణ పరీక్షలు చేయడం చట్ట విరుద్ధం. ఈ చట్టాన్ని పీసీపీఎన్ డీటీ (prohibition of sex selection - pre conception and pre natal diagnostic techniques) చట్టంగా వ్యవహరిస్తారు. 1994లో ఈ చట్టం తీసుకొచ్చారు'' అని డాక్టర్ అల్తాఫ్ తెలిపారు.
''ఈ కేసులో మూడేళ్లు కచ్చితంగా శిక్ష పడే అవకాశం ఉంది. పీసీపీఎన్ డీటీ చట్టం ప్రకారం.. లింగ నిర్ధరణ బహిర్గతం చేసినందుకు సెక్షన్ 3ఏ, నిబంధనలకు విరుద్ధంగా అల్ట్రా సౌండ్ స్కానింగ్ యంత్రం వినియోగించినందుకు సెక్షన్ 6, దురుద్దేశపూర్వకంగా పరీక్షలు చేసినందుకు సెక్షన్ 23 వర్తిస్తాయి. మొదటిసారి అయితే మూడేళ్ల వరకు జైలుశిక్షతోపాటు పది వేల రూపాయల జరిమానా విధిస్తారు. రెండోసారి కూడా కేసు నమోదైతే లక్ష రూపాయల జరిమానా, ఐదేళ్ల వరకూ జైలు శిక్ష విధిస్తారు'' డాక్టర్ అల్తాఫ్ మొహమ్మద్ వివరించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్ రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్ , ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ , ట్విటర్ లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ లో సబ్ స్క్రైబ్ చేయండి.)
Comments
Leave a Comment